ఎంతగా ప్రేమిస్తావు?
ఎంతకాలం ప్రేమిస్తావు ??
తరచూ వినే ప్రశ్నే మరోసారి వినిపించింది
ప్రేమించడం అంటే అప్పు కాదు
ప్రేమించి బాకీ తీర్చమని వెంటపడడానికి
ప్రేమించడం అంటే దాచేడబ్బు కాదు
ఎంత ప్రేమించానో లెక్క ఒప్పచెప్పడానికి
ప్రేమించడం ఓ పనికాదు
అలిసిపోయానని ఆగిపోవడానికి...
ప్రేమించడం ఓ సమస్య కాదు
పరిష్కారం అందగానే వెళ్లిపోవడానికి
ఎందుకో
ఓ సొగసైన పలకరింపు
ఆత్మీయ ఆలింగనం ... స్నేహపు కరచాలం
ఇవేవీ ప్రేమ చిహ్నాలు కావంటారే
అయినా
మృదుత్వం తెలియని వారితో
సరళమైన మాటలే ఎరుకలేని మనుషులతో
అసూయనే రాజకిరీటం అనుకునే వారితో
ప్రేమ గురించి ఏమి చెబుతాం... ఎంతని చెబుతాం
ఇంతకూ...
ప్రేమించడమంటే ఏమిటో ...
ఎప్పుడు ప్రశ్నగానే ఎదురైంది
జవాబు ఇంకా కుదిరించబడలేదు..
రెండు వాక్యాల్లో అందించడానికి.....